About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.
మన ఆరోగ్యం మాసపత్రికకి 2017 సెప్టెంబరు నెలకి వ్యాసము
వామనజయంతి
    శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడిగా అవతరించిన అవతారం వామనావతారం. భాద్రపద శుక్లపక్షంలో ద్వాదశి రోజున మహా పతివ్రత అయిన ఆదితికి శ్రీమహావిష్ణువు కుమారుడుగా జన్మించాడు. ఈ అవతారం విశిష్ఠతని గురించి విష్ణుపురాణంలో వివరించబడింది.
   వ్యాసమహర్షి రచించిన పద్ధెనిమిది పురాణాల్లో వామనపురాణం ఒకటి. శ్రీమహావిష్ణువు త్రివిక్రమ స్వరూపంతో అవతారమెత్తి బలి చక్రవర్తిని పాతళ లోకానికి పంపించాడు. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో వామనవతారం అయిదవది.
   ఈ పురాణం పూర్వభాగం, ఉత్తరభాగం అని రెండు భాగాలుగా విభజించబడింది. పూర్వభాగంలో 10 వేల శ్లోకాలు ఉన్నాయి. ఉత్తరభాగం ఇప్పుడు దొరకట్లేదు. ఈ పురాణంలో శ్లోకాలే కాదు గద్య భాగాలు కూడా ఉన్నాయి. పూర్వభాగంలో 97 అధ్యాయాలు ఉన్నాయి.
   కురుక్షేత్రంలో బ్రహ్మ సరోవరాన్ని గురించి సరోమహత్యం అనే పేరుతో 28 అధ్యాయాల్లో వర్ణింపబడింది. బలిచక్రవర్తి జరిపిన యజ్ఞం కురుక్షేత్రంలో జరిగిందని చరిత్రకారుల అభిప్రాయం. ఈ పురాణాన్ని పుల్యస్తుడు నారదుడికి చెప్పాడని అంటారు.
    ధర్మానికి భంగం కలిగినప్పుడు తాను అవతరించి ధర్మసంస్థాపన చేస్తానని శ్రీ కృష్ణుడు చెప్పినట్టు మనకు భగవద్గీత తెలియచేస్తోంది. ద్ధర్మసంస్థాపన కోసం భగవంతుడు  ఈ భూమి మీద అవతరించడమే దశావతారాలలో ఒకటైన వామనావతారం.
    వామనుడి అవతార చరిత్రలో బలిచక్రవర్తి, వామనమూర్తి మాటల్లో పే చక్కటి సందేశం ఇమిడి ఉంది. వామనావతారాన్ని  గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం...
   పూర్వం దేవతలతో యుద్ధం జరిగినప్పుడు రాక్షసరాజైన బలిచక్రవర్తి ఇంద్రుడి వల్ల యుద్ధంలో ఓడిపోయాడు. అవమానం భరించలేక  గురువైన శుక్రాచార్యుడిని శరణువేడుకున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత గురువు శుక్రాచార్యుడి దయవల్ల  బలిచక్రవర్తి స్వర్గం మీద అధికారాన్ని సంపాదించాడు.
   దీంతో అధికారం పోగొట్టుకున్న ఇంద్రుడు తల్లి అదితి దగ్గరికి వెళ్ళి బాధ చెప్పుకుని తన పదవి తనకి వచ్చేటట్టు చెయ్యమని ప్రార్థించాడు. ఇంద్రుడి పరిస్థితిని చూసిన అదితికి దుఃఖం కలిగింది. పయోవ్రతానుష్టానం  చేసి శ్రీమహావిష్ణువుని ఆశ్రయించింది.
   ఆ వ్రతం పూర్తవుతూ ఉండగా చివరి రోజు శ్రీమహావిష్ణువు అదితికి ప్రత్యక్షమయ్యాడు.  ఆమెతో తల్లీ!  బాధపడకు. నీకు నేను కుమారుడిగా జన్మించి, ఇంద్రుడికి చిన్న తమ్ముడిగా ఉండి అతడికి అంతా మంచి జరిగేటట్టు చేస్తాను! అని చెప్పి  అంతర్థానమయ్యాడు.
   ఇలా అదితికి శ్రీమహావిష్ణువు వామన రూపంలో కుమారుడిగా జన్మించాడు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువునే కుమారుడిగా పొందిన అదితి సంతోషానికి అంతులేదు.
   శ్రీమహావిష్ణువుని వామనమూర్తిగా బ్రహ్మచారి రూపంలో దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందపడ్డారు. వామనమూర్తికి ఉపనయన సంస్కారాలు తామే స్వయంగా నిర్వర్తించి ధన్యులయ్యారు.
   బలి చక్రవర్తి వద్ద నుంచి మూడడుగుల నేలను దానంగా పొంది, ఒక అడుగును భూమిపై మోపి, రెండో అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమించడం కోసం క్రిందనుంచి ఒక్కోదాన్నే దాటుకుంటూ ఎలా విజృంభించాడో, ఏ విశేషణాలూ లేకుండా, ఒక మహాద్భుత దృశ్యాన్ని కండ్ల ముందు రూపు కట్టించాడు మహాభక్తుడు, కవి పోతన.  
 ఇంతింతైవటుఁడింతయైమరియుఁదానింతైనభోవీధిపై
 నంతైతోయదమండలాభ్రమునకల్లంతైభారాశిపై
 నంతైచంద్రునికంతయైధ్రువునిపైనంతమహర్వాటిపై
 నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై
   ఇంతయ్యాడు, మరింకింతయ్యాడు, ఆకాశానికి అంతయ్యాడు, మేఘమండలానికి అల్లంతయ్యాడు, జ్యోతిర్మండలానికి అంతయ్యాడు, చంద్రుణ్ణి దాటాడు, ధ్రువుడికి దాటి ఇంకా పైకి వెళ్లాడు, మహర్లోకం దాటిపోయాడు, సత్యలోకంకన్నా ఉన్నతంగా ఎదిగాడు. బ్రహ్మాండమంతా నిండిపోయాడు ఇదీ ఒక కుబ్జబాలకుడు క్రమక్రమంగా అజాండభాండాన్ని ఆక్రమించిన త్రివిక్రమ స్ఫూర్తి. క్రింద మునులూ, బలి చక్రవర్తీ, శుక్రుడూ నివ్వెరపోయి చూస్తున్నారు.
   క్షణానికి ముందు కళ్లముందు నిలబడి ఉన్న బ్రహ్మచారి బాలకుడు ఒక్కసారిగా కాదు క్రమక్రమంగా ఎదిగి భూనభోంతరాలు నిండిపోవడాన్ని ఇంతకన్నా అందంగా రూపు కట్టించడం అసాధ్యం. పద్యం పద పదానికీ విరుగుతూ, వామనుడు పదపదానికీ పెరుగుతూ పోయే క్రమతను చూపిస్తూ. ఇంతై, అంతై, దీనికింతై, దానికింతై అంటూ ఒక గొప్ప దృశ్యానికి ప్రత్యక్ష వివరణ మన కళ్ళకి కట్టినట్టు చూపించాడు. భక్తపోతనకి నమస్కరిద్దాం! 
   బలి చక్రవర్తి భృగుకచ్ఛము అనే ప్రదేశంలో అశ్వమేధ యాగం చేస్తున్నాడని వామనమూర్తికి తెలిసింది. వెంటనే  బ్రహ్మచారి  ఆ ప్రదేశానికి వెళ్ళాడు. బ్రహ్మతేజస్సుతోను, దివ్య యశస్సులతోను వెలిగే వటుడైన వామనుడు దండాన్ని, గొడుగుని, కమండలాన్ని ధరించి;  పవిత్రమైన రెల్లుగడ్డితో మొలత్రాడుని, యజ్ఞోపవీతాన్నీ ధరించి;  శరీరం మీద మృగచర్మం, శిరస్సు మీద జడలతో వామనుడు బ్రాహ్మణ రూపంతో యజ్ఞమండపంలోకి  ప్రవేశించాడు.
   బ్రాహ్మణ బ్రహ్మచారిని చూసిన బలిచక్రవర్తి పూజ్య భావంతో ఉచితాసనం మీద  కూర్చోపెట్టి పూజించాడు. ఆ తర్వాత వామనుడిని ఏం కావాలో అడగమన్నాడు...వామనుడు మూడు అడుగుల భూమి"  కావాలని అడిగాడు. 
   శుక్రాచార్యుడుకి శ్రీమహావిష్ణువే ఆ రూపంలో వచ్చాడని తెలుసు. అందువల్ల ఆ బ్రహ్మచారికి దానం ఇవ్వద్దని శిష్యుణ్ణి వారించాడు. కాని, శుక్రాచార్యుడు ఎంత వారించినా బలిచక్రవర్తి ఆయన మాట వినలేదు. దానం చెయ్యడం కోసం  సంకల్పం చెప్పడానికి తన చేతిలో ఉన్న జలపాత్రని ఎత్తాడు. 
   శుక్రాచార్యుడు తను చెప్పినదాన్ని తన శిష్యుడు వినట్లేదని అతడి మేలుకోరి జలపాత్రలో ప్రవేశించి జలం వచ్చే దారికి తన ముఖాన్ని అడ్డుపెట్టాడు. వామనమూర్తి ఒక దర్భని తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిలో పొడిచాడు. ఆ దర్భ శుక్రాచార్యుడి కంటికి గుచ్చుకుంది. దాని వల్ల శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయింది .
   సంకల్పం పూర్తి అయిన వెంటనే వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తి తన ఆకారాన్ని పెంచి ఒక్క అడుగు భూమి మీద, మరొక అడుగు ఆకాశం మీద పెట్టాడు. మూడు అడుగు పెట్టడానికి చోటు కావాలని బలిచక్రవర్తిని అడిగాడు.
   బలిచక్రవర్తి భక్తితోను, అనందంతోను శ్రీమహావిష్ణువు విరాట్స్వరూపాన్ని చూస్తూ  మూడో అడుగు పెట్టడానికి తన తలను చూపిస్తూ వినయంగా కూర్చున్నాడు. దీంతో మూడో అడుగును బలిచక్రవర్తి తలపైన పెట్టిన త్రివిక్రముడు అతన్ని పాతాళానికి తొక్కేశాడు.
   బలిచక్రవర్తి దాన గుణానికి సంతోషించిన శ్రీమహావిష్ణువు అతడికి పాతాళలోక రాజ్యాన్ని యిచ్చాడు. ఇంద్రుడికి ఇంద్ర పదవిని అప్పగించాడు అని పురాణాలు చెబుతున్నాయి.
   అటువంటి మహిమాన్వితుడైన వామనుడు పుట్టిన రోజున శ్రీ మహావిష్ణువుని నిష్ఠతో ప్రార్థించేవాళ్లకి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పెద్దల మాట.
  బలిచక్రవర్తి దాన గుణానికి మెచ్చుకుని శ్రీమహావిష్ణువు ప్రతి సంవత్సరం కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని తను చూసుకునేట్టు వరమిచ్చాడు.
   ఇప్పటికీ కేరళలో బలిచక్ర్రవర్తి రాక కోసం ఎదురుచూస్తూ ఓనం అనే పేరుతో పండగను జరుపుకుంటూ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
   భాద్రపద శుద్ద ద్వాదశి వామన జయంతిగా  చెప్పబడిందిఈ రోజున వామనమూర్తిని ఆరాధిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున బ్రాహ్మణులకు పెరుగును దానం చేస్తే మంచి ఫలితాలని పొందవచ్చు అని పురాణాలమాట.
   శ్రీమహావిష్ణువు మన రక్షణ కోసం ఎన్నో అవతారాలు ఎత్తాడు. అందులో వామనావతారం కూడా ఒకటి. అందుకే వామనజయంతి రోజు కృతజ్ఞతతో శ్రీమహావిష్ణువుని భక్తితో సేవిద్దాం.
   పాఠకులకి వామనజయంతి శుభాకాంక్షలు
భమిడిపాటి బాలాత్రిపురసుందరి
సెల్ నం. 9440174797


సుందరమైన కథలు - యముడి కోరల్లోంచి


యముడి కోరల్లోంచి
  
   ఆమెకి తెలుసు అమె భర్త క సంవత్సరంలో చచ్చిపోతాడని. ఎలాగయినా సరే తన భర్తని యముడి కోరల్లోంచి బయటకి తీసుకు రావాలని ఆమె పట్టుదల. అనుకున్నట్టే చేసింది కూడా. ఇదే సావిత్రి కథ.
   సావిత్రి ఒక రాజకుమార్తె. ఆమె తల్లితండ్రులు చాలాకాలం సూర్యభగవానుణ్ణి ఉపాసించడం వల్ల పుట్టింది. ఆమె గొప్ప గుణవంతురాలు. యుక్త వయస్సు వచ్చాక తనకు వరుణ్ణి తనే ఎంచుకోవాలని అనుకుంది. వరుడి కోసం వెతుక్కుంటూ అనేక ప్రదేశాలు తిరిగింది. అడవిలో ఒక కుటుంబంతో ఆమెకి పరిచయ మయింది. వాళ్ళ కుమారుడు సత్యవంతుణ్ణి చూసి అతన్నే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ విషయం ఇంటికి వెళ్ళి తలితండ్రులకి చెప్పింది.
   సావిత్రి ఎంచుకున్న వరుణ్ణి చూసి సావిత్రి చాలా దురదృష్టవంతురాలని అనుకుని అందరూ చాలా బాధపడ్డారు. సత్యవంతుడు రాజకుమారుడే అందులో సందేహం లేదు. సావిత్రి వంటి సుగుణాలరాశికి అతడు సరయిన వరుడే. కాని, సత్యవంతుడు అల్పాయుష్కుడు.
    సత్యవంతుడు జీవితంలో ఇంకా అనేక అపదల్లో చిక్కుకుని ఉన్నాడు. అతడి తండ్రి రాజ్యం పోయింది. కుటుంబమంతా అడవిలో నివసిస్తున్నారు. సత్యవంతుడి తల్లితండ్రులకి మాత్రమే తెలిసిన భయంకరమైన రహస్యం ఒకటి ఉంది. తమ కుమారుడు అల్పాయుష్కుడని, ఒక సంవత్సరమే జీవిస్తాడని. ఆ విషయాన్ని నారదమహర్షి చెప్పాడు.
   సత్యవంతుడిలో భగవంతుడు మెచ్చే ఒక గుణం సత్యాన్ని పలకడం. అతడు ఎప్పుడూ నిజమే పలుకుతాడు, అంకితభావం కలవాడు, గుణవంతుడు. సత్యవంతుడికి ఆయుష్షు తక్కువ ఉందని, అతడి తల్లితండ్రులకి రాజ్యం లేక అడవులవెంట తిరుగుతున్నారని తెలుసుకుని సావిత్రిని చూసి అందరూ జాలి పడ్డారు. ఆమె తల్లితండ్రులు కళ్లనీళ్లతో ఆమె మనస్సుని మార్చుకోమని సావిత్రికి మరీ మరీ చెప్పారు. వాళ్ళు ఎంత చెప్పినా ఆమె వినలేదు.
   సావిత్రి తండ్రి” సావిత్రీ! ఇతణ్ణి కాకుండా మరొక వరుణ్ణి ఎంచుకో. సత్యవంతుడు మంచివాడు, గుణవంతుడే! అయినా అతడు దురదృష్టవంతుడు. నువ్వు రాజకుమార్తెవి కనుక నీకు మరొక వరుణ్ణి కోరుకునే అవకాశం ఉంది మళ్ళీ ఆలోచించుకో అని చెప్పాడు.
   సావిత్రి మాత్రం “ తండ్రీ! నేను గౌరవనీయమైన కుటుంబంలో పుట్టిన ఆడపిల్లని. నా మనస్సుని ఒకసారి సత్యవంతుడికి ఇచ్చేశాక మళ్ళీ మార్చుకోలేను. ఏది జరిగితే అది జరుగుతుంది. ఏది ఎలా జరిగినా దాన్ని నేను భరిస్తాను” అంది. నారద మహర్షి కూడా అమెకి అనేక విధాలుగా నచ్చచెప్పాడు. కాని ప్రయోజనం లేకపోయింది.
   సావిత్రి సత్యవంతుల వివాహం జరిగిపోయింది. సత్యవంతుడికి మాత్రం అతడి ఆయుష్షు తగ్గిపోతోందని తెలియదు. ఒక సంవత్సరం గడిచిపోయింది. కొన్ని రోజుల్లో అతడికి మరణం తప్పదు. ఈ నిజాన్ని సావిత్రి మాత్రం మర్చిపోలేదు.
   పెళ్ళి జరిగిన వెంటనే సావిత్రి రాజభవనాన్ని వదిలి తన భర్తతో కలిసి అడవులకి వెళ్ళిపోయింది. అడవుల్లో అత్తమామలతో ఉంటూ వాళ్ళ ప్రేమని పొందింది. కష్టాలు మొదలయ్యాయి. ఆమెకి ఇప్పుడు తన భర్తను రక్షించుకోడమే ధ్యేయం.  రాత్రి పగలు భర్త ఆయుష్షు కోసమే భగవంతుణ్ణి  ప్రార్ధిస్తోంది. ఆమె అందరిలా కన్నీళ్లతోను, బాధతోను గడపట్లేదు. రాబోయే ఆపదనుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ తను సాధించగలను అన్న నమ్మకంతో జీవిస్తోంది.
   సత్యవంతుడికి భూమిమీద చివరి రోజు ...అదే కథగా మారింది. కట్టెలు తీసుకుని రావడానికి దట్టమైన అడవిలోకి వెడుతున్న సత్యవంతుడితో సావిత్రి కూడా బయలుదేరింది. సత్యవంతుడు ఆమెను రావద్దని చెప్పినా వినకుండా అతణ్ణి అనుసరించింది. ప్రతి క్షణం భర్తలో కలిగే మార్పుల్ని గమనిస్తోంది. ఆ క్షణం రానే వచ్చింది. ఇద్దరూ దట్టమైన అడవిలో ఉండగా ఉన్నట్టుండి సత్యవంతుడికి నీరసంగా అనిపించి కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. సావిత్రి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. అంతే అతడి శ్వాస ఆగిపోయింది. మొదట సావిత్రి భయపడింది .. అంతలోనే తనని తాను సరిపెట్టుకుంది.
   సత్యదీక్షాపరుడైన సత్యవంతుడు భగవంతుడికి ఇష్టుడైయ్యాడు. సావిత్రి తన పూజలతోను, పాతివ్రత్యంతోను పవిత్రురాలయింది. ఇద్దరూ దేవతా స్వరూపులయ్యారు. సత్యవంతుడి ఆత్మని తీసుకెళ్లడం అంత తేలిక కాదు. అతడి ఆత్మని తీసుకుని వెళ్ళడానికి యముడే స్వయంగా వచ్చాడు. సావిత్రి తన పాతివ్రత్య ప్రభావం వల్ల తన భర్త ఆత్మని తీసుకుని వెడుతున్న యముణ్ణి చూడగలిగింది.
   సత్యవంతుడి ఆత్మను తీసుకుని వెడుతున్న యముడు తన వెనకాలే వస్తున్న సావిత్రిని చూసి ఆశ్చర్య పోయాడు. ఆమె వైపు చూసి “సావిత్రీ! వెనక్కి వెళ్ళిపో! నువ్వు నా వెనుక రాలేవు!” అన్నాడు.
   సావిత్రి వినయంగా ”స్వామీ! నేను నా విధిని నిర్వహిస్తున్నాను. నా భర్తని అనుసరించడం నా విధి. ఇప్పుడు కూడా నేను నా భర్త సత్యవంతుడి వెనకాలే వెడుతున్నాను. అతడు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను!” అంది.
   యముడు సావిత్రిని తన వెనుక రావద్దని అనేక విధాలుగా నచ్చచెప్పాడు. ఆమె వినకుండా అతడి వెనుకే నడుస్తూ” నేను వివాహితురాల్ని. భర్తని అనుసరించడం నా ధర్మం. నేను నా భర్తని అనుసరిస్తూ వస్తాను!” అని మళ్ళీ అదే మాట చెప్పింది.
   చావుకు భగవంతుడైన యముడు ఆమెకు భర్తయందు ఉన్న అంకిత భావాన్ని అర్ధం చేసుకున్నాడు. సావిత్రి పాతివ్రత్యానికి మెచ్చుకుని సత్యవంతుడికి పూర్ణాయుష్షుతో పాటు రాజ్యం, సంపదలు, పిల్లలు మొదలయినవన్నీ ఇచ్చాడు. అంతేకాదు సావిత్రి తల్లితండ్రులకి, అత్తమామలకి కూడా కావలసినవన్నీ ఇచ్చాడు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడ ధైర్యాన్ని వదలకుండా పోరాడి సావిత్రి భర్తని దక్కించుకుంది.
   కొన్ని వందల సమస్యలు ఎదురుగా ఉన్నాకూడా ఒక భారతీయ మహిళ చావుని సవాలు చేసి అనుకున్న దాన్ని సాధించడమే కాకుండా  అసాధ్యమైన తన బంధువుల సమస్యల్ని కూడా భగవంతుడి అనుగ్రహంతో తీర్చగలిగింది. అందుకు ఆమె స్వచ్ఛమైన మనస్సు, పవిత్రతలే కారణం.
   కష్టాలు గలిగాయని బాధపడుతూ కూర్చోకుండా ధైర్యంతో వాటిని ఎదుర్కోవాలి. ఆకాశంలో దట్టంగా అలుముకున్న నల్లటి మేఘాలు వాటంతటవే చెల్లా చెదురుగా వెళ్ళిపోగానే ఆకాశమంతా సూర్య కాంతి ప్రసరిస్తుంది. అదే విధంగా ఆపదలు తొలగిపోగానే సుఖసంతోషాలు జీవితంలో ప్రసరిస్తాయి. సత్యదీక్ష, పవిత్రత, భగద్భక్తి, పట్టుదల ఉంటే ఎటువంటి కష్టాన్నైనా అవలీలగా దాటవచ్చు అన్నారు స్వామి వివేకానందుడు.
   ఆపదలు కలిగినప్పుడు భగవంతుణ్ణి సేవిస్తూ ధైర్యంగా ఉండాలి. సావిత్రి తనకు కలిగిన ఆపదల్ని ధైర్యంగా ఎదుర్కుని, తన భర్తని యముడి దగ్గర నుంచి వెనక్కి తెచ్చుకోడమే కాకుండ అదే ఆపదని అవకాశంగా  మార్చుకుని తన అత్తమామలకి, తలితండ్రులకి కూడా మంచి జరిగేలా చూసింది.


మత్సరము కర్ణుడు కథ

మత్సరము
కర్ణుడు కథ
   పాండవులు బ్రాహ్మణ వేషంలో ద్రౌపదీ స్వయంవరానికి వెళ్ళారు. ఎంతోమంది రాజులు ప్రయత్నించినా ఎవరికీ సాధ్యం కాలేదు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టాడు.
   మత్స్యయంతాన్ని కొట్టిన అర్జునుణ్ణి చూసి క్షత్రియ కుమారులు ఆశ్చర్యపోయారు. ఇది మానమాత్రుడికి సాధ్యం కాదు.
   ఇతడు బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుడో, హరుడో, భానుడో, గుహుడో అయి ఉండచ్చు అంటూనే అక్కడ చేరిన రాజులందరు అర్జునుణ్ణి పొగుడుతున్నారు. దేవతలు పూలవాన కురిపించారు.
   బ్రాహ్మణులు క్షత్రియుల వల్ల కానిదాన్ని సాధించమన్న ఆనందంతో తమ పై పంచెలు తీసి గాలిలో ఎగరేసి ఆనందంతో కేకలు పెట్టారు.
   ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు అర్జునుడికి చెరొక వైపు నిలబడ్డారు.ఆ సంతోష సమయంలో సుందరాంగి అయిన పాంచాలి మందగమనంతో వయ్యారంగా నడుస్తూ రాజకుమారులందరు చూస్తుండగా వచ్చి మన్మథుడిలా వెలిగిపోతున్న పరాక్రమశాలి అర్జునుడి మెడలో పూలమాల వేసింది.
   ఆ ఉత్సవాన్ని చూస్తున్నకర్ణ, దుర్యోధన బృందానికి అసూయతో కళ్ళుకుట్టాయి. ఈ ద్రుపదుడు మనల్ని ఎంత అవమాన పరిచాడు? బంధువుల్ని పిలిచినట్టు రాజులందర్నీ ఇక్కడికి ఎందుకు రప్పించాలి? రప్పించి మనల్ని కాదని బ్రాహ్మణుడికి కన్యని ఎందుకు అప్పగించాలి?
   మనకి అవమానం చేసిన ఇతడికి గుణపాఠం చెప్పాలి. ఈ ఉత్సవ ప్రదేశాన్ని రణభూమిగా మారుద్దాం రండి అని రాజకుమారుల్ని రెచ్చగొట్టారు.
   కాని, రాజకుమారుల తీరు వేరే విధంగా ఉంది. ఈ బ్రాహ్మణ కుమారుడి తప్పులేదు. తన విద్యానైపుణ్యంతో రాజకుమారిని దక్కించుకున్నాడు. ఏ దోషమూ లేని బ్రహ్మణుణ్ణి చంపితే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది.
   కాబట్టి, గర్వంతో గుడ్డివాడైన పాంచాల రాజు మీదకి యుద్ధానికి వెడదాం. ఆ బ్రాహ్మణ బాలుణ్ణి విడిచి పెట్టండి అని అంటూనే రాజకుమారులు  అర్జునుణ్ణి వదిలేసి ద్రుపదుణ్ణి చుట్టేశారు.
   వాళ్లందర్నీ చూసిన ద్రుపదుడు బ్రాహ్మణ సమూహంలోకి చొచ్చుకు పోయాడు. బ్రాహ్మణులందరు రాజుకి అండగా నిలబడ్డారు.
   అర్జునుడు నా అస్త్రాలతో వాళ్ళ దర్పాన్ని అణగ్గొడతాను మీరందరు కొంచెం దూరంగా ఉండండి అని బ్రహ్మణులకి చెప్పి తన అవక్ర పరాక్రమంతో రాజలోకం మీద విజృంభించాడు.
   వాళ్ల మీదకి ఆపకుండా బాణాలు వదిలాడు. భీముడు ఒక పెద్ద చెట్టుని పెళ్ళగించుకుని వచ్చి చేత్తో పట్టుకుని అర్జునుడికి సహాయంగా నిలబడ్డాడు.
   అక్కడ జరుగుతున్న యుద్ధాన్ని యాదవుల వైపు ఉన్న బలరాముడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. శ్రీకృష్ణుడు నెమ్మదిగా అన్నా! ఆ మహా కోదండాన్ని పట్టుకుని శత్రువుల్ని పారిపోయేలా చేస్తున్నవాడు పాండవ మధ్యముడు అర్జునుడు.
   అతడి పక్కనే మహావృక్షాన్ని పట్టుకుని యుద్ధం చేస్తూ విజృంభిస్తున్న వాడు వృకోదరుడు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని వేసినప్పుడు బహ్మణ వర్గం నుంచి లేచి బయటకి వెళ్ళిన గౌరవర్ణంతో ఉన్నవాడు ధర్మరాజు. అతడి వెంట వెళ్ళినవాళ్ళు ఇద్దరూ నకుల సహదేవులు అని చెప్పాడు.
   వాళ్ళు అయిదుగురు పాండవులన్న విషయం విని ఆశ్చర్యంతోను ఆనందంతోను పరవశించి పోయాడు బలరాముడు. కృష్ణా! ఏమిటీ వీళ్ళు పాండవులా? ఎంత భాగ్యం! లక్క ఇల్లు కాలిపోయినప్పుడు వీళ్ళు ఎలా తప్పించుకున్నారో?  ఈ మహా వీరుల్ని దర్శించగలిగిన ఈ రోజు ఎంతో పుణ్యమైన రోజు ! అని మళ్ళీ మళ్ళీ అంటూ బలరాముడు ఆనందభాష్పాలు కారుస్తున్నాడు. 
   భీమార్జునులతో యుద్ధం చేసి అనేకమంది రాజులు ఓడిపోతున్నారు. దుర్యోధనుడికి ప్రాణసఖుడు, అంగరాజ్యానికి రాజయిన కర్ణుడు పార్థుడితో యుద్ధానికి తలపడ్డాడు. మద్రదేశానికి రాజయిన శల్యుడు భీముడితో యుద్ధం మొదలెట్టాడు.
   వాళ్ళ యుద్ధ కౌశల్యాన్ని అక్కడ కూర్చున్న వాళ్ళు ఆనందంగా చూస్తున్నారు. కర్ణార్జునులు, భీమశల్యులు ఘోరంగా పోరాడుతున్నారు. కర్ణార్జునులు వేస్తున్న బాణాలతో ఆకాశమంతా కప్పబడి పోయింది. అర్జునుడు బాణాలు వేస్తున్న వేగానికి వాటిని ఆపలేక పోతున్నాడు కర్ణుడు.
   ఇంత గొప్పగా బాణాలు సంధిస్తున్న ఈ బ్రాహ్మణ కుమారుడు ఎవరో అనుకుని బ్రాహ్మణకుమారా! క్షత్రియుల్లో అర్జునుడు, బ్రాహ్మణుల్లో పరశురాముడు తప్ప యుద్ధభూమిలో నన్ను ఎదిరించి పోరాడ గలిగినవాడు మరొకడు లేడు. నీ పరాక్రమం, నీకు విలువిద్యలో నేర్పు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి అన్నాడు.
   రాధేయుణ్ణి చూసి అర్జునుడు నవ్వుతూ నువ్వు ఇప్పుడు చెప్పిన వాళ్ళల్లో నేను ఎవ్వర్నీ కాదు. శాస్త్రవిద్యలన్నిటిలోను ప్రావీణ్యాన్ని సంపాదించిన బ్రాహ్మణ తేజస్సు కలవాణ్ణి. ఈ రణరంగంలో నిన్ను ఓడించబోతున్నవాణ్ణి. ఇంక అప్రస్తుత ప్రసంగాలు అపు అన్నాడు.
   కర్ణుడు సిగ్గుపడి బ్రాహ్మణ తేజస్సుని ఓడించడం కుదరని పని అనుకుని అర్జునుడితో యుద్ధం ఆపి వెళ్ళిపోయాడు. మల్లయుద్ధంలో భీముడు తన బలంతో శల్యుణ్ణి పట్టి కింద పడేశాడు. శల్యుడు వెంటనే లేచి ఒళ్ళు దులుపుకుని బహ్మణ వర్గం నవ్వుతుండగా  అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
  స్వయంవరానికి వచ్చిన రాజులందరు తమతమ దేశాలకి వెళ్ళిపోయారు. అందరూ చూస్తుండగా ద్రౌపదిని వెంటపెట్టుకుని భీమార్జునులు వెళ్ళిపోయారు.
   ఉత్సాహంగా ఉన్న బ్రాహ్మణులందరూ ఆనందంతో గుమిగూడి బీమార్జుల వెనక నడిచారు.

అసూయ ఉన్న చోట అవమానం తప్పదు!!

భాష మిగలాలంటే అమ్మ మిగలాలి

29-08-2017 మాతృభాషాదినోత్సవం రోజు 120 మంది కవులతో జరిగిన కవిసమ్మేళనంలో చదివిన కవిత
భాష మిగలాలంటే అమ్మ  మిగలాలి
సౌజన్యం, దాక్షిణ్యం, నిస్వార్ధం అనేది నిజమైన సంస్కృతి.  
దౌర్జ్యన్యం, నిర్దాక్షిణ్యం, స్వార్ధం కుసంస్కృతి
ఉపయోగించే సాధనాలు, వస్తువులు నాగరికతని సూచిస్తాయి
ఆలోచనలు, సాహిత్యం, వేదాంతం, మతం, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి
సాంఘికంగా ఎప్పటి పరిస్థితులు అప్పటివే!
సంప్రదాయ సంపదని స్థిరస్తిగా తరతరాలకి అందిస్తున్నవాళ్ళు అమ్మలు
సంగీతం, నృత్యం, ఆటలు, వంటలు, గేయాలు, సామెతలు, పొడుపు కథలు
పురాణ శ్రవణం, పండుగలు, వ్రతాలు, నోములు, ఉత్సవాలతో కలిసి జీవించడం
పూర్వ ఆచారాల సారమే సంప్రదాయం!
అక్షరం ముక్కకి నోచుకోపోయినా... జీవితంలో జరిగే మంచి చెడ్డల్ని, విధి విధానాల్ని
పాటల రూపంలో పాడుకుంటూ .. పిల్లలకి బ్రతుకు తెరువు నేర్పడం కోసం
నిలబెట్టే  క్రమశిక్షణే... సమాజ శ్రేయస్సుకి అమ్మలు వేస్తున్న బాట!
సంస్కృతీ సంప్రదాయాలు అనేక శతాబ్దాల విలువలకి ప్రతీకలు...
జీవన సరళి మారుతుంది ... ధర్మం మారదు!
పునాదులు గట్టిగా ఉండాలంటే... విలువలు తెలియాలి
దేశ ఉన్నతికి కారణం ఆచారాలు, కట్టుబాట్లు... వాటి వల్ల కలిగే రక్షణే!
సదాచారం, సంప్రదాయం, సంస్కృతి పట్ల కలిగి ఉండే విశ్వాసం ఆస్తికత
మంచి పనులు చెయ్యడం, శుచిగా, ఓర్పుగా ఉండడం, పెద్దల్ని గౌరవించడం
దాన ధర్మాలు చెయ్యడం, తమకు తాముగా నేర్చుకుని తరతరాలకు అందిస్తారు...
తల్లిగా, ఇల్లాలిగా, బాధ్యత గల మహిళలుగా ప్రతి ఇంట విలసిల్లాలని ఆశిస్తారు
భారత సంతతి ఎక్కడ ఉంటుందో... అక్కడ  సంస్కృతి సంప్రదాయాలు అల్లుకుపోతాయి
జాతి నిలబడాలంటే సంస్కృతీ సంప్రదాయాలు కొలమానం కాదు...
జాతిని తెలియచేసేది భాష...దాన్ని అనుసరించి నడిచేవే సంస్కృతి సంప్రదాయాలు
వినబడాలి ఇంటింట అమ్మ భాష ... ప్రతిధ్వనించాలి ఇంటింట అమ్మ నాన్నల పిలుపు
అమ్మభాషని నిలబెట్టగలిగేది అమ్మలే...గడప గడపకి తెలుగు తోరణం కట్టాలి
అన్ని గడపలు కలిసి ఉద్యమించాలి...పరదేశం, పరభాష వదిలిపెట్టాలి...
మన పిల్లలు మనదేశానికే పౌరులుగా ఉండాలి!
అమ్మ భాష వదిలి.. పరభాష నేర్చి.. పరదేశం వెడితే...అమ్మ కూడా పరాయిదే!
సంస్కృతి సంప్రదాయలతో పాటు అమ్మ భాషని కాపాడండి...

మమ్మీలుగా కాదు...అమ్మలుగా మిగలండి!! 

ఋషిపంచమి

మన ఆరోగ్యం మాసపత్రికకి ఆగష్టు 2017 లో పంపించిన వ్యాసము
ఋషిపంచమి
   భవిష్యోత్తరపురాణం ఈ ఋషిపంచమి వ్రతప్రాశస్త్యాన్ని గురించి వివరిస్తోంది. పేరుకు ఋషిపంచమి అయినా ఇది పూర్తిగా స్త్రీలకు సంబంధించిన వ్రతంగా చెప్పబడుతోంది. ఒకనొకప్పుడు శితాశ్వుడు అనే రాజు స్త్రీల పాపాల్ని తక్షణమే హరించే వ్రతం గురించి అడిగినప్పుడు బ్రహ్మ ఈ వ్రతాన్ని ఉపదేశించి, శ్రద్ధగా ఆచరిస్తే దోషాలన్నీ పరిహారమవుతాయని చెప్పాడని వ్రతకల్పం తెలియచేస్తోంది.
   మన ప్రాచీన ఋషుల్ని పూజించే వ్రతం ఋషిపంచమి. పురాణ కథల ప్రకారం ప్రతివారి వంశానికి ఒక ఋషి మూలపురుషుడిగా ఉన్నాడు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. గోత్ర రూపంలో వాళ్ళ పూర్వ ఋషుల్ని ప్రతిరోజూ స్మరించుకుంటారు. కొంతమందికి వాళ్ళ పూర్వ ఋషుల పేర్లు తెలియవు. లేవనే అనుకుంటారు కాని వాళ్ళ వంశాలకి కూడా ఋషులు ఉన్నారు. మరీచి ఋషి వంశం వరుసగా శ్రీరాముడి వరకు నడిచింది.
   ఎంతోమంది ఋషులకి ప్రతినిథులుగా సప్త ఋషుల్ని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. కశ్యపుడూ, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వసిష్ఠుడు, జమదగ్ని ఈ ఏడుగురు సప్తఋషులు. మనిషి తప్పనిసరిగా తీర్చుకోవలసిన ఐదురుణాల్లో ఋషిరుణం కూడా ఒకటి. ఎందుకంటే మనం అనుసరించాల్సిన ధర్మాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మనకు నేర్పింది వీళ్లేమరి. ఇంతటి మహోపకారాన్ని మనకు చేసినందుకు కృతజ్ఞతగా వీరిని సతీసమేతంగా భక్తితో స్మరించి పూజలు ఆచరించుకోవడం మన ధర్మం కాదూ!
  సప్త ఋషుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. దక్షప్రజాపతి కుమార్తెల్లో పదమూడు మందిని, వైశ్వానరుడి కుమార్తెల్లో ఇద్దరినీ పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ల వల్ల దైత్యులు, ఆదిత్యులు, దానవులు సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, రాక్షసులు, వృక్ష లతాతృణ జాతులు, సింహ, మృగ, సర్పాల్ని, పక్షుల్ని, గోగణాల్ని, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులు, పౌలోములు, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని కుమారులుగా పొందాడు.
   సప్త ఋషుల్లో రెండవవాడైన అత్రిమహర్షి బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకడు. అత్రి తన తపోబలంతో త్రిమూర్తుల్ని పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయుల్ని కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.
   భరద్వాజుడు ఉతథ్యుడి కుమారుడు. తల్లి పేరు మమత. బృహస్పతి దయవల్ల జన్మించి, ఘృతాచి పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణుడు జన్మించడానికి కారణమవుతాడు.
   విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రుడితో అబద్ధమాడించడానికి కొంత ఫలాన్ని, మేనక వల్ల శకుంతల జననానికి కొంత ఫలాన్ని పోగొట్టుకున్నాడు. దుష్యంతుడు శకుంతల దంపతులకు పుట్టిన కుమారుడు భరతుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.  
   తీవ్రమైన కరువు ఏర్పడినప్పుడు ఋషులకి అందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వల్ల మాయా గోవుని దర్భతో అదిలించి బ్రహ్మహత్యాపాతకాన్ని పొందాడు. ఆ దోష పరిహారం కోసం గోదావరీనదిని భూమి పైకి తెచ్చిన గొప్ప మహర్షి. తన భార్యను శిలగా మారేట్టు శాపమిచ్చింది అయనే.
జమదగ్ని ఋషి - రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడు పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనస్సులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన అమెని తన కొడుకు పరశురముడితో నరికించాడు. ఆ తరువాత పరశురాముడి ప్రార్థన వల్ల ఆమెను పునర్జీవితురాల్ని చేశాడు.
   ఏడో ఋషి వసిష్ఠుడు. ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానసపుత్రుల్లో ఒకడు. వైవశ్వత మన్వంతరంలో సప్తరుషుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్షప్రజాపతి పుత్రిక ఊర్జద్వారా రజుడు, గోత్రుడు, ఊర్థ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు కుమారుల్ని పొందాడు. స్వాయంభువ మన్వంతరంలోనూ సప్తఋషుల్లో ఒకడు. ఒకప్పుడు మిత్రావరుణులకి ఊర్వశిని చూసి రేతస్సు స్ఖలితం అవడం వల్ల కుండలో వసిష్ఠుడు, అగస్త్యుడు జన్మించారని ప్రతీతి.
   సప్త ఋషులు తేజస్సు కలిగినవాళ్లు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు. ఏడు సముద్రాలు, ఏడు కులపర్వతాలు, ఏడుగురు ఋషులు, ఏడు ద్వీపాలు, ఏడు భువనాల్ని ప్రాతఃకాలంలో స్మరించడం వల్ల శుభాలు కలుగుతాయని అంటారు. అందుకే భాద్రపద శుక్లపక్ష పంచమి రోజున స్త్రీలు తమ పూర్వకృత దోష పరిహారం కోసం విధివిధానంలో పూజిస్తారు. ప్రతి ఋషిపంచమికి సుమంగళులు ఋషులని పూజించి తమ దోషాల్ని దూరం చేసుకుని, ఆయుష్షు, బలము, యశస్సు, ప్రజ్ఞ పొందగలరని వ్రతవిధానం తెలియచేస్తోంది.
   ఋషిపంచమి వ్రతాన్ని స్త్రీలు తప్పకుండా ఆచరించాలి. వినాయమచవితి మరునాడు వచ్చే పంచమిని ఋషిపంచమి అంటారు. సప్త ఋషులు ఆ రోజున తూర్పున ఉదయిస్తారు. ఆ రోజు బ్రహ్మవిద్య నేర్వవలసిన రోజు. సప్త ఋషుల కిరణాలు ఆ రోజు సాధకుల మీద ప్రసరిస్తాయి. కనుక, బ్రాహ్మీ ముహూర్తంలోనే ధ్యానం చేసుకోవాలి. సప్తఋషులే గాయత్రీమంత్రానికి మూలగురువులు. మానవుడి శరీరంలో ఏడు యోగచక్రాలు ఉంటాయి. వాటిని వికసింపచేసే వారే ఈ సప్తఋషులు.
   మొట్టమొదటిసారిగా వేదమంత్రాల్ని దర్శించి వైదిక ధర్మాన్ని ప్రవర్తింపచేసిన ఆదికాలపు హిందూఋషుల్ని స్మరించే శుభసందర్భం ...భాద్రపద శుద్ధ పంచమి. ఆ రోజున ఉపవాసం ఉంటే ఆ తొలిగురువులు మిక్కిలి ప్రసన్నులయి మనం కోరిన కోరికలు తీరుస్తారు. ముఖ్యంగా స్త్రీలు రోజంతా సంపూర్ణ ఉపవాసం ఉంటే వారికీ, వారి సంతానానికి తరతరాలపాటు ఆయురారోగ్య సౌభాగ్యాల్ని అనుగ్రహిస్తారు. అత్తలకి శక్తి లేకపోతే కోడళ్ళయినా ఉపవాసం చేయాలి. సర్పదోషాలతో బాధపడుతూ సంతానం లేక బాధపడేవారికి మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా చెయ్యడం వంశవృద్ధికరం. ఐశ్వర్యదాయకం.
   దేవుడు ఎంత కరుణామయుడో చూశారా! ఇది చెయ్యి అంటాడు. పోనీ, చేతకాకపోతే కనీసం చెప్పినదానిలో సగమైనా చెయ్యమంటాడు. అదీకుదరక పోతే అందులో సగం చెయ్యమంటాడు. ఎన్ని మినహాయింపులో చూశారా! అయినా ఆయన్ను తలవలేకపోతున్నాం, కొలువలేకపోతున్నాం. సరే! ఏడుగుర్ని కాకపోయినా వీరిలో ఐదుగురినైనా తప్పనిసరిగా ఈ భాద్రపద శుద్ధ పంచమినాడు స్మరించుకుని అర్చించాలన్నారు. అందుకే ఈరోజును ఋషిపంచమి అన్నారు.
   ఆ ఐదుగురూ ఎవరంటే త్రిగుణాతీతుడైన అత్రి, ఈయన భార్య అనసూయ. వీరిద్దరూ దుర్భిక్షాన్ని పోగొట్టి లోకాన్ని ఉద్ధరించిన జంట. ముఖ్యంగా ప్రస్తుతం ఈ జంటను పూజించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మిగిలిన నలుగురూ భరద్వాజుడు, విశ్వామి త్రుడు, వసిష్ఠుడు, జమదగ్ని. ఈ ఐదుగురినీ పూజించే రోజే ఋషిపంచమి.
వ్రత విధానం
 తప్పనిసరిగా ప్రతిస్త్రీ ఈ వ్రతాన్ని ఏడాదికోమారు చేసుకోవలసిందే! ఈ రోజు సప్తఋషుల్ని వారి భార్యలతోసహా పూజించుకోవాలి. ఈ వ్రతం చేసుకునేందుకు విధిగా కొన్ని నియమాల్ని పాటించాలి. ఉత్తరేణి మొక్కను వేళ్లతో సహా పెరికి దాని కొమ్మతో ఉదయాన్నే పళ్లు తోముకోవాలి. అనంతరం గంగా జలం, బురద, తులసిచెట్టులోని మట్టి, ఆవుపేడ, రావిచెట్టుమట్టి, గంధపు చెక్క, నువ్వులు, గోమూత్రం వీటి నన్నింటిని కలిపి చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆపై108 చెంబులతో స్నానం చెయ్యాలి. స్నానం నదిలో గానీ, ఇంటిలోగానీ చెయ్యవచ్చు. స్నానం చేస్తున్న సమయంలోనే ఈ క్రింది శ్లోకం 108 సార్లు చదవాలి.
"ఆయుర్బలం  యశో వర్చః ప్రజాపశు వశూనిచ!
బ్రహ్మ ప్రజ్ఞాం చ మేధాంచ త్వన్నో దేహి వనస్పతే!!"

  ఈ వ్రతాన్ని ముత్తైదువులు చేస్తుంటే తిల అభ్యంగ స్నానం చేసి పసువు
, కుంకుమల్ని ధరించి పూజకు కూర్చోవాలి. అదే వితంతువలు చేస్తున్న పక్షంలో విభూది, గోపి చందనం, పంచగవ్యాలతో స్నానం చెయ్యాలి. ఇలా చేసిన అనంతరమే పూజకు ఉపక్రమించాలి.
      పూజామందిరం దగ్గర గణపతి, నవగ్రహాలు ఏడు కలశాల్నిఉంచి అత్రి, కశ్యప, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని మరియు వశిష్ఠ మహర్షుల్ని వారి భార్యలతో సహా ఆవాహనము చెయ్యాలి. అందరికీ షోడశోపచార పూజ చేయాలి. ఏడుగురు వేద పండితులను ఆహ్వానించి వాయనంతో కలిసి తాంబూలము సమర్పించాలి. ఈ పూజా విధానం ముగిసిన తరువాత ఆకాశంలో సప్తబుషుల్ని, అరుంధతిని చూస్తూ ఆయా బుషుల్ని పూజించాలి. అన్నట్టు ఈ పూజకు ముఖ్యంగా నాలుగువత్తుల దీపాన్ని ఉంచాలి. పూజ అయిన తరువాత గేదె పెరుగు, వేయించిన శనగలు, తోటకూర కూర తదితరాలను నైవేద్యం పెట్టి బంధుమిత్రులతో భోజనం ముగించాలి.
   ఆరోజు రాత్రి సప్తర్షులకు సంబంధించిన కథలను వినాలి
. మరునాడు భర్తతో కలిసి హోమము చేసి వ్రతాన్ని పూర్తి చెయ్యాలి. ఇలా వరుసగా ఏడు సంవత్సరాలు చేసి తరువాత ఉద్యాపన చేసుకోవాలి.
వ్రతకథ
   విదర్భదేశంలో ఉత్తంకుడనే బ్రాహ్మణుడికి కూతురు
, కొడుకు ఉండేవారు. దురదృష్టవశాత్తూ కూతురికి పెళ్లైన కొద్దిరోజులకే వైధవ్యం ప్రాప్తించింది. అందువల్ల బ్రాహ్మణజంట ఆమెను తీసుకుని గంగాతీరంలో నివాసముండేవారు. ఒకరోజు ఆ అమ్మాయి శరీరంలో నుంచి పురుగులు పడడం గమనిస్తాడు ఉత్తంకుడు. అయితే ఆయన మంచి దైవభక్తుడు కావడంతో తన కుమార్తెకిలా ఎందుకు జరుగుతోందో దివ్య దృష్టితో గమనిస్తాడు. పూర్వజన్మలో ఈమె రజస్వలైనప్పుడు అన్నంగిన్నె తాకినందువల్ల ఇలా జరిగిందని తెలుసుకుంటాడు. వెంటనే ఈమెతో ఋషిపంచమి వ్రతం చేయించి ఆమె దోషాన్ని పరిహరింపచేస్తాడు.
   అలాగే మరొక కథ కూడా ప్రాశస్త్యంలో ఉంది. విదర్భ నగరంలో శ్వేతజితుడనే క్షత్రియుడు, సుమిత్ర అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేవారు. సుమిత్ర రజస్వల అయిన సందర్భంలో శ్వేతజితు డామెను తాకడం, మాట్లాడడం వంటివి చేస్తాడు. ఈమె కూడా ఆ సమయంలో అందరితోనూ మామూలుగానే మాట్లాడేది. ఇలా కాలం గడచి వారిద్దరూ మరణించి సుమిత్ర కుక్కగానూ, శ్వేతజితుడు ఎద్దుగానూ జన్మించి సుమిత్ర కొడుకు గంగాధరం ఇంటికే చేరతారు.
   ఒకరోజు గంగాధరం సుమిత్ర ఆబ్దీకం పెడుతున్నాడు. గంగాధరుడు తల్లికి శ్రాద్ధక్రియలు పూర్తిచేసి పరమాన్నం నేవేద్యం పెడుతుంటే ఆ కుక్క వచ్చి దాన్ని ముట్టుకుంటుంది. దాంతో ఆ పాయసాన్ని పారబోసి వేరేగా వండి నైవేద్యం పెడుతుంది వంటమనిషి. తద్దినం పెట్టేది తనకే కదా అని పాయసం తింటే దాన్ని పారబోసి వేరే వండించాడని బాధ పడుతుంది కుక్కరూపంలో ఉన్న సుమిత్ర.  తన బాధను ఎద్దుతో చెప్పుకుంటుంది. వీరిద్దరి భాషా తెలిసిన గంగాధరం ఆ మాటలు విని కుక్క రూపంలో ఉన్నది తన తల్లి అని తెలుసుకుంటాడు.  గురువు ద్వారా వాళ్ల గురించి తెలుసుకుని బుషిపంచమి వ్రతం చేసి వాళ్ల దోషాలు పోయేలా చెస్తాడు.
   కాబట్టి ఒకరకంగా చెప్పాలంటే ఋషిపంచమిని ప్రాయశ్చిత్తం కోసం చేసుకునే వ్రతంగానే అనుకోవాలి. ఈ కంప్యూటర్‌ ప్రపంచంలో వ్రతాలు, నోములు అంటే వింతగా చూసినప్పటికీ మన పురాతన ఆచార వ్యవహారాల్నీ ఇప్పటికీ ఎంతో నిష్టగా ఆచరించేవారు ఎంతో మంది ఉన్నారు.
 నీతి నియమాల్ని తప్పకుండా భగవంతుడిపై మనసు పెట్టి ఆయన్నే ధ్యానించే వారూ ఉన్నారు. వారందరి దివ్యత్వం వల్లనే ప్రస్తుతం ఎన్ని కష్టాలు వస్తున్నావాటినుంచి మబ్బువీడిన చంద్రునిలా వెంటనే బయటపడ గలుగుతున్నాం.
   మనకి తెలియకుండానే ఎన్నో పాపాలు చేస్తుంటాం. కనుక పూర్వం నుంచీ నడుస్తున్న మన సంప్రదాయం ప్రకారం ఈ ఋషిపంచమి వ్రతాన్ని భక్తితోను, నియమనిష్ఠలతోను  చేసుకుని సప్తఋషుల దయకు పాత్రులవుదాం.
   స్త్రీలందరికీ ఋషిపంచమి శుభాకాంక్షలు!!