About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

సుందరమైన కథలు-జన్మసంస్కారము

జన్మసంస్కారము
సహస్రపాదుడు కథ
    భృగువంశంలో ప్రమతికీ ఘృతాచికీ పుట్టినవాడు, అమితమైన ప్రకాశం కలవాడు రురుడు. అతడి భార్య ప్రమద విశ్వావసుడు అనే గంధర్వుడు, అప్సరస మేనకల కుమార్తె.
  ఒకసారి ప్రమదని పాము కరిచింది. రురుడు తన ఆయుష్షులో సగం ఇచ్చిఆమెని మరణించకుండా కాపాడుకున్నాడు.
   అప్పటి నుంచి రురుడికి పాములంటే చాలా కోపం. మొత్తం పాముల్ని చంపేసి ఎక్కడా పాములు లేకుండా చెయ్యాలని సంకల్పించాడు. అందుకే పాముల్ని వెతికి వెతికి కర్రతో కొట్టి చంపుతున్నాడు.
   ఒకచోట అతడికి ఒక పెద్ద పాము కనిపించింది. దాని పేరు ’డుండుభము’. అది అసలు విషం లేని పాము. దాన్ని కూడా చంపాలని తన చేతిలో ఉన్న కర్ర  పైకి పట్టుకున్నాడు.
   ఆ పాము భయంతో భగవన్నామం చేస్తూ “ నువ్వు మంచి ప్రవర్తన గలవాడివి, గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నావు. నీకు పాముల మీద ఎందుకింత కోపం వచ్చింది?” అని అడిగింది.
   అది విని “నా పేరు రురుడు, నాది భృగువంశం. పాము నా భార్యకి హాని చేసింది. అందుకే అన్ని పాముల్ని చంపేస్తున్నాను. నిన్ను కూడా వదులుతానని అనుకోకు” అంటూనే చేతిలో ఉన్న కర్రని పైకి ఎత్తాడు.
   యమదండంలా ఉన్న ఆ కర్రని చూస్తూ డుండుభమనే ఆ పాము వెంటనే మహర్షి రూపంలోకి మారి నిలబడింది.
   మహర్షిని చూసిన రురుడు “ ఇది చాలా వింతగా అనిపిస్తోంది. ఇప్పటి వరకు పాము రూపంలో ఉన్న నువ్వు ఇప్పుడు ఈ రూపంలోకి ఎలా మారావు?” అని అడిగాడు.
   ఆ మహర్షి నా కథ చెప్తాను విను “నా పేరు సహస్రపాదుడు. నేను, ’ఖగముడు’ సహాధ్యాయులం. ఒకరోజు హోమశాలలో ఉన్నప్పుడు నేను గడ్డితో చేసిన పాముని సరదాగా నా స్నేహితుడు ఖగముడి మీద వేశాను.
   అతడు దాన్ని నిజమైన పాము అనుకుని భయపడ్డాడు. వెంటనే కోపంతో  “నువ్వు విషం లేని పాముగా మారిపోతావు!” అని నన్ను శపించాడు.
   నాకు ఆశ్చర్యంగా అనిపించి స్నేహితుడివని ఏదో వేళాకోళంగా గడ్డిని పాము అకారంలో చేసి నీ మీద వేశాను. నిజం పాము తెచ్చి నీ మీద వెయ్యలేదు కదా? ఎందుకంత కోపం తెచ్చుకున్నావు? అని అడిగాను.
   అప్పటికి శాంతించిన ఖగముడు తను చేసిందేమిటో తెలుసుకున్నాడు. “నేనిచ్చిన శాపం ఎలాగూ జరగక మానదు. కొంతకాలం విషం లేని పాముగానే జీవిస్తావు.
   తరువాత భృగువంశోద్ధారకుడైన రురుణ్ణి చూడగానే నీకు శాపం నుంచి విముక్తి కలుగుతుంది అదే ఇప్పుడు జరిగింది” తన గురించి చెప్పాడు.
   మహర్షి సహస్రపాదుడు రురుణ్ణి చూసి మళ్ళీ ఈవిధంగా చెప్పాడు “నువ్వు బ్రాహ్మణుడివి, గొప్పదైన భృగువంశంలో జన్మించావు, సద్గుణ సంపన్నుడివి, గొప్ప తేజస్సు కలవాడివి. నువ్వు ఈ విధంగా పాముల్ని కొట్టి చంపడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
   హింస చెయ్యడం క్షత్రియుల స్వభావం. ఇతరులలో ఉన్న హింసా ప్రవృత్తిని పోగొట్టగల దయ స్వభావం కలవాళ్ళు బ్రాహ్మణులు. నీకు తెలుసా? జనమేజయుడు అనే రాజు సర్పయాగం చేస్తున్నప్పుడు నాగవంశం నాశనమవడం మొదలుపెట్టింది.
    అ సమయంలో నీ తండ్రికి శిష్యుడైన అస్తీకుడు అనే పేరు గల బ్రాహ్మణుడు ఆ యాగన్ని ఆపించాడు. కాని నువ్వు మాత్రం గొప్ప బ్రహ్మణవంశంలో పుట్టి నీ బార్య మీద ప్రేమతో ఏదో ఒక పాము హాని చేసిందని మొత్తం నాగజాతినే నాశనం చేస్తున్నావు.
   జ్ఞానవంతుడివి కనుక నువ్వు చేస్తున్న పని మంచిదో కాదో కొంచెం అలోచించు!” అని రురుడికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు సహస్రపాదుడు.
   రురుడు సహస్రపాదుడు చెప్పింది విని తన తప్పు తెలుసుకున్నాడు. అప్పట్నుంచి పాముల్ని కొట్టి చంపడం మానేశాడు. జన్మతో వచ్చిన సంస్కారం ఎప్పటికీ వెంటనంటే ఉంటుంది.

మంచి సంస్కారం పొందాలంటే మంచి పనులే చెయ్యాలి!!

No comments:

Post a Comment