About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

సుందరమైన కథలు-సాధుహింసాఫలము జరాసంధుడు కథ

సాధుహింసాఫలము
జరాసంధుడు కథ
     ఒకసారి నారద మహర్షి ధర్మరాజు దగ్గరికి వచ్చి“ ధర్మనందనా! నువ్వు రాజసూయ యాగం చెయ్యడానికి అర్హుడివి. నీ తమ్ముళ్ళు బలపరాక్రమాలు కలవాళ్ళు. భూమండలంలో ఉన్న రాజులందర్నీ ఓడించగలరు.
  ఒక్క జరాసంధుణ్ణి ఓడించడమే కొంచెం కష్టం. అతడి సంగతి భీముడు చూసుకుంటాడు. ఈ యాగం చెయ్యడం వల్ల పితృదేవతలకి ఉత్తమగతులు కలుగుతాయి. కాబట్టి వెంటనే రాజసూయ యాగం మొదలుపెట్టు అని చెప్పి వెళ్ళాడు.
   ఆ మాటలు విని భీమార్జునులు కూడా చాలా ఉత్సహంగా ఉన్నారు. రాజసూయ యాగం చేస్తే పితృదేవతలకి మంచిదని నారదుడు చెప్పడంతో ధర్మరాజు ముందు శ్రీకృష్ణుణ్ణి తీసుకుని రమ్మని తమ్ముళ్ళని పంపించాడు.
   శ్రీకృష్ణుడు వచ్చాక నారదుడు చెప్పిన విషయం అతడికి చెప్పి జరాసంధుడితో  యుద్ధమంటే మాటలు కాదు. కనుక ఏదయినా ఉపాయం చెప్పమని అడిగాడు ధర్మరాజు.
  శ్రీకృష్ణుడు ధర్మరాజుకి జరాసంధుడి గురించి వివరించాడు. జరాసంధుడు బృహద్రథుడి కొడుకు. జరాసంధుడు పెద్దవాడయ్యక అతడికి పట్టాభిషేకం చేసి తపస్సు చేసుకునేందుకు అడవులకి వెళ్ళి పోయాడు బృహధ్రథుడు.
   జరాసంధుడు పరమ దుర్మార్గుడు. రాజకుమారుల్ని బంధించి తీసుకొచ్చి చెరలో పెట్టేవాడు. భైరవుడికి పూజ చేసినప్పుడల్లా  ఒక రాజకుమారుణ్ణి బలిస్తూ ఉండేవాడు. చాలాసార్లు మథురానగరం మీద కూడా దండెత్తి వచ్చేవాడు.
   అతడి బాధ పడలేక మథురానగరంలో నివసించే వాళ్ళందరు కుశస్థలానికి వెళ్ళి రైవతక పర్వతం మీద దుర్గం కట్టుకుని అక్కడే ఉండిపోయారు. జరాసంధుణ్ణి ఓడించ గలమా లేదా అని ముందే సందేహం ఎందుకు?  గొప్ప పనులు చెయ్యాలని అనుకున్నప్పుడు సందేహాలతో మొదలుపెట్ట కూడదు”. చేసేది మంచి పనే అయినప్పుడు అందుకు భగవంతుడి సహకారం తప్పకుండా ఉంటుంది అని చెప్పాడు.
   “మహాబలవంతుడు, కౄరుడు, మాయావి అయిన జరాసంధుణ్ణి తన తమ్ముళ్ళు యుద్ధంలో ఓడించగలరా?” అని అలోచనలో పడ్డాడు ధర్మరాజు.  అతడి ఆలోచన తెలుసుకున్న శ్రీకృష్ణుడు “ధర్మరాజా! నీ సందేహం నాకు అర్ధమయింది. భీమార్జునుల్ని నాతో పంపించు. జరాసంధుణ్ణి రెచ్చగొట్టి పోరుకి అహ్వానించి అతణ్ణి యుద్ధంలో చంపి వస్తాం. మా ముగ్గురిలో ఒకళ్ళ చేతిలో అతడు తప్పకుండా చస్తాడు” అన్నాడు.
   ధర్మరాజు” కృష్ణా! భీమార్జునులు నా రెండు కళ్ళు. వాళ్ళు లేకుండ నేను ఉండలేను. కాని, కృష్ణుడు ఉండగా అర్జునుడికి భయం లేదు. కృష్ణార్జునుల తోడు ఉండగా భీముడికీ భయం లేదు. నువ్వూ, నా తమ్ముళ్ళూ ఉండగా నాకు కూడా భయం లేదు. ఇప్పుడు నేను ప్రశాంతంగానే ఉన్నాను. మీరు ముగ్గురూ శ్రీఘ్రంగా వెళ్ళి  లాభంగా రండి!” అని తమ్ముళ్ళని దీవించి శ్రీకృష్ణుడితో పంపించాడు.
   జరాసంధుణ్ణి ఓడించడానికి వెడుతున్న కృష్ణార్జునభీముల్ని ధర్మరాజు సంతోషంగా చూశాడు. ఆ భారతవీరులు ముగ్గురు అనేక పర్వతాలు, ఏరులు, సరయూనది, మిథిల, గంగానది దాటి, ఇంకా అనేక ప్రదేశాలు దాటి మగథ రాజ్యంలోకి ప్రవేశించారు.
  అక్కడ గోరథం అనే పర్వతం పైకి  ఎక్కారు. అక్కడి నుంచి చిత్రవిచిత్రంగా ఉన్న పట్టాణలు, ఎత్తైన భవనాలతో కనిపిస్తున్న గిరివ్రజ పట్టణాన్ని చూసి దాని వైభవానికి ఆశ్చర్య పోయారు.
   శ్రీకృష్ణుడు “అర్జునా! ఇప్పుడు మనం గోరథం అనే పర్వతం మీద ఉన్నాం. గోరథం, ఋషభం, వైహారం, ఋషిగిరి, చైత్రకాద్రి అనే ఈ అయిదు పర్వతాలు ఆ నగరానికి అయిదుగురు రక్షకభటుల్లా నిలబడి రక్షిస్తున్నాయి. అందుకే ఈ పట్టాణానికి గిరివ్రజపురం అని పేరు వచ్చింది. ఈ పర్వతాలకున్న బలం వల్ల, పూర్వం గౌతమ మహర్షి ఇచ్చిన వరం వల్ల యుద్ధంలో వీళ్ళని ఎవరూ ఓడించలేరు.
   శ్రీక్రుష్ణుడు ఆ పర్వతద్వారం నుంచి లోపలికి వెళ్ళకుండా చైత్రక పర్వతం వైపు తీసుకుని వెళ్ళాడు. పర్వత శిఖరం మీద మూడు భేరులు కనిపించాయి. భీమార్జునులకి వాటిని చూపిస్తూ “ పూర్వం మగధ రాజులు మానుషాదం అనే పేరుగల ఎద్దుని చంపి దాని చర్మంతో ఈ మూడు భేరుల్ని తయారు చేశారు. కొత్తవాళ్ళు ఎవరైనా ఈ పట్టణంలో అడుగు పెడితే గౌతమ మహర్షి ఇచ్చిన వరం వల్ల ఈ మూడు భేరులు మ్రోగుతాయి. కాబట్టి ముందు మనం ఈ మూడింటిని పగలగొట్టాలి అని చెప్పాడు. ముగ్గురు మూడు భేరుల్ని పగలగొట్టారు.
   అసలు మార్గం వదిలేసి వేరే మార్గంలో నగరంలోకి ప్రవేశించారు. పూలమాలలు, అత్తరు, గంథం మొదలైన సుగంధ ద్రవ్యాలు ఉన్న గదిలోకి వెళ్ళారు. కొన్ని పూలమాలలు మెళ్ళో వేసుకుని అత్తరు గంధ ఒంటికి పూసుకున్నారు. జరాసంధుడి దగ్గరికి బ్రాహ్మణులు ఏ మార్గంలో వెడతారో ఆ మార్గంలో వెళ్ళి జరాసంధుడి మందిరం చేరుకున్నారు.
   వచ్చినవాళ్ళు బ్రాహ్మణులు అనుకుని జరాసంధుడు వాళ్ళని గౌరవంగా లోపలికి తీసుకుని వెళ్ళి భక్తిగా సత్కరించి మధుపర్కాలు ఇచ్చాడు. వచ్చిన వాళ్ళు మధుపర్కాలు తీసుకోలేదు. జరాసంధుడికి అనుమానం వచ్చింది.
   అయ్యా! మధుపర్కాలు ఇస్తుంటే తీసుకోలేదు కనుక మీరు ఈ ప్రదేశానికి కొత్తగా వచ్చి ఉంటారు. చైత్రక పర్వతం మీద ఉన్న మూడు భేరుల్ని పగలకొట్టినవాళ్ళు కూడా మీరే అయి ఉంటారు. రోజూ బ్రాహ్మణులు వచ్చే ద్వారంలో వచ్చిన మీరు చూడ్డానికి బ్రాహ్మణులుగానే కనిపిస్తున్నారు. మీ రూపు రేఖలు చూస్తుంటే క్షత్రియుల్లా కనిపిస్తున్నారు. అసలు మీరు ఎవరు? అని అడిగాడు జరాసంధుడు.
   అతడు అడిగిన దానికి బదులుగా శ్రీకృష్ణుడు జరాసంధా! మేం క్షత్రియులం. మిత్రుల దగ్గరికి వెళ్ళాలంటే ప్రధాన ద్వారంలో వెళ్ళాలి. శత్రువుల దగ్గరికి వెళ్ళాలంటే ఆ ద్వారం నుంచి వెళ్ళకూడదు. గంథము, మాలలు మొదలైన వాటిలో లక్ష్మీదేవి ఉంటుంది. వాటిని బలవంతంగా తీసుకున్నాం. వేరే పని మీద వచ్చాం కనుక నీ అతిథ్యాన్ని తీసుకోలేదు.
   మగధరాజు ఆశ్చర్యపోయాడు. అయ్యా! నేను మీకు ఎప్పుడూ కీడు చెయ్యలేదు. పైగా నేను దైవభక్తి కలవాణ్ణి, బ్రాహ్మణుల్ని గౌరవిస్తాను. నేను మీకు శత్రువుని ఎలా అయ్యాను? అన్నాడు.
   మాధవుడు మగధేశ్వరా! సార్వభౌముడు ధర్మరాజు దుష్టసంహారం చేసి రమ్మని మమ్మల్ని పంపించాడు. నువ్వు దుర్మార్గంగా రాజకుమారుల్ని బంధించి తెచ్చి పశువుల్ని బలిస్తున్నట్టు బలిస్తున్నావు. ఏ తప్పూ చెయ్యని వాళ్ళని చంపడం కంటె పెద్ద పాపం ఇంకోటి ఉందా?
   అన్ని ధర్మాల్ని రక్షిస్తున్న మేము నువ్వు చేస్తున్న పాపపు పనులు చూసి కూడా చూడనట్టు వదిలేస్తే ఆ పాపం మమ్మల్ని బాధిస్తుంది. ఆ భయంతోనే నిన్ను చంపాలని వచ్చాం. నువ్వు గొప్ప వీరుడివే కాని, నీ కంటే గొప్ప వీరుడు లేడన్న గర్వంతో ఉన్నావు. మంచివాళ్ళని బాధపెట్టేవాడు ఎంత గొప్పవాడైనా నాశనమవుతాడు.
   నా మాట విని నువ్వు బంధించి తెచ్చిన రాజకుమారుల్ని విడిచిపెట్టు. అనవసరంగా నీ నాశనాన్ని నువ్వే కొనితెచ్చుకోకు. ఇంక దాచడమెందుకు మేమెవరో కూడా  చెప్తున్నాను విను. నేను శ్రీకృష్ణుణ్ణి, వీళ్ళిద్దరు భీమార్జునులు. రాజుల్ని విడిచి పెట్టకపోతే ఈ పాండవ సింహాలు నీ గర్వాన్ని అణుస్తాయి అన్నాడు.
   శ్రీకృష్ణుడి మాటలు విని జరాసంధుడి కళ్ళు నిప్పుగోళాల్లా ఎర్రబడ్డాయి, కనుబొమ్మలు ముడిపడ్డాయి. కోపంతో శరీరం కంపించిపోయింది. శ్రీకృష్ణుడితో నేను దేవుణ్ణి ఆరాధించడం కోసం తెచ్చుకున్న రాజుల్ని విడిచిపెట్టను.
  అయినా నేను వాళ్ళతో యుద్ధం చేసి ఓడించి పట్టి తెచ్చానే కానీ, అన్యాయంతోను, మోసంతోను తీసుకుని రాలేదు. మీ ముగ్గురిలో ఎవరైనా ఒకళ్ళు నాతో యుద్ధం చెయ్యచ్చు. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు కోపంగా.
   అతడి మాటలకి శ్రీకృష్ణుడు మేం ముగ్గురం కలిసి నీతో యుద్ధం చెయ్యడం యుద్ధ నీతి కాదు. మాలో ఏవరితో యుద్ధం చేస్తావో నువ్వే నిర్ణయించుకో! అన్నాడు.
   అది విని జరాసంధుడు భీమసేనుడి వైపు చూపించి మీ ముగ్గురిలో ఇతడే నాతో యుద్ధం చెయ్యగల వీరుడు. అతడితోనే యుద్ధం చేస్తాను అన్నాడు.
   సమాన బలం కలిగిన భీమ జరాసంధులు భీకరంగా పోరాడుతున్నారు. కార్తీకమాసం మొదటిరోజు మొదలు పెట్టి త్రయోదశి వరకు ఆపకుండా మల్లయుద్ధం చేశారు. వాళ్ళ మధ్య జరుగుతున్న యుద్ధం చూసిన వాళ్ళు భయంతో వణికిపోయారు.
    త్రయోదశినాటి రాత్రికి జరాసంధుడి బలం తగ్గిందని శ్రీక్ష్ణుడికి అర్ధమయింది. వెంటనే భీమసేనా! ఈ మగధుడికి ఇంక సత్తువ లేదు. నీ బలం, వాయుదేవుడి బలం తెలిసేటట్టుగా ఇతణ్ణి చంపి లోకంలో నీ కీర్తి నిలబడి ఉండేటట్టు చేసుకో! అన్నాడు.  
   శ్రీకృష్ణుడి మాటలకి భీమసేనుడు సంతోషంతో ఉప్పొంగి పోయాడు. వెంటనే విజృభించి జరాసంధుణ్ణి చంపి లోకాలకి మంచి జరిగేటట్టు చేశాడు.
మంచివాళ్ళని బాధపెట్టేవాడు ఎంత గొప్పవాడైనా నాశనమవుతాడు!!


No comments:

Post a Comment