About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

మన ఆరోగ్యం మాసపత్రిక 2018ఫిబ్రవరి
సంకష్టహర గణపతి వ్రతము
శుక్లాంబరధరంవిష్ణుంశశివర్ణంచతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
   గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు. అవి 1. వరద గణపతి పూజ 2. సంకష్టహర గణపతి పూజ. వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే, అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే  'వినాయక చవితి'. అన్ని రకాల వరాల్నీ మనకి అనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు.
   సంకష్టహర చతుర్థి నాడు ప్రత్యేకంగా ఏమీ పాటించరు కానీ ఉపవాసముండి, సాయంకాలం చంద్రదర్శనం చేసిన తర్వాత భోజనం చేస్తారు. వినాయకుడిని పూజించడం రాత్రి నెలవంక చూడటం ఈ రోజు విశేషాలు.
సంకష్టహర గణపతి పూజా విధానం:  భక్తి శ్రద్ధలతో యధాశక్తిగా నైవేద్యానికి తగిన పదార్థాలు ఏర్పాటు చేసుకుంటారు.  ప్రీతిగా ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని పూలు, ధూపం దీపం, నైవేద్యం గణపతికి సమర్పించుకుంటారు. గణపతిని మందారపూలతో పూజించడం విశేషంగా అనుకుంటారు. శక్తి కొలదీ విగ్రహం పెట్టుకుని గాని, పటము పెట్టుకునిగానీ గణపతిని పూజించవచ్చు.
   జిల్లేడు గణపతి లేదా అర్క గణపతి మూర్తిని పూజిస్తే కోరుకున్న కోరికలు తొందరగా తీరతాయని భక్తుల విశ్వాసం.
      మన పూర్వీకులు దైవం ప్రసన్నమై ప్రీతి చెంది కోరిన కోరికలు తీరుస్తారని  కొందరు దేవుళ్ళకి కొన్ని పదార్థాలను విశేషించి నివేదించాలని చెప్పారు. అదేవిధంగా వినాయకుడికి దూర్వా లేదా గరిక అని ఆకుని నివేదించడం విశేషం. లేతగా ఉండే గరికపోచలు 3 అంగుళాలకు మించకుండా ఆరోగ్యకరమైన వాటిని వినాయకుడికి నామాలు చెబుతూ నివేదిస్తారు. కుడుములు  తప్పనిసరిగా గణపతికి నైవేద్యంగా పెడతారు.
 సంకటనాశన గణేశ స్తోత్రం:
   నారద ఉవాచ - ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్, భక్తావాసం స్మరేనిత్యం, ఆయుష్కామార్థసిద్ధయే! ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్, తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్, లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ, సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్, నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్, ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్! ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః! న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో! విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనమ్, పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్, జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్! సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః అష్టేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్! తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః! ఇతి శ్రీ నారద పురాణే సంకట నాశన గణేశా స్తోత్రం సంపూర్ణం
సంకష్టహర గణపతి వ్రతము:
   గణపతిని పూజించి పూజల్లో చవితి పూజ విశేషమైనది. పౌర్ణమి తర్వాత వచ్చే చవితికి వరదచతుర్థి అని, అమావాస్య తర్వాత వచ్చే చవితికి సంకష్టహర చతుర్థి అని పేరు.
   ఈ రోజున వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కోరుకున్న కోరికలు నెరవేరడానికి సంకష్టహర చతుర్థి నాడు గణపతి వ్రతాన్ని దీక్షని ఆచరించడం విశేషమని చెబుతారు.
   వినాయకుడి విశిష్టత భారతీయ ఋషులు సమాజాన్ని సంఘాన్ని లోతుగా పరిశీలించి జీవన విధానంలో అధ్యాత్మ ప్రాతిపదికలుగా కొన్ని ఆచారాలను నిర్దేశించారు. అందులో ప్రతి పూజలోనూ ప్రారంభంలో విఘ్నేశ్వరుడిపూజ చేయడంవల్ల ఘన బాధలు తొలగుతాయని ఎందరో దేవతలు ఉన్నా ఆది పూజ్యుడు గా వినాయకుని పూజించడం అవసరమని అన్నితెలియచేశారు.
 వ్రత విధానము:
   సంకష్టహర చతుర్థి 3, 5,11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సంకష్టహర చతుర్థి రోజున ప్రారంభిస్తారు.   ప్రారంభించేరోజున శుచిగా స్నానం చేసి, ఎరుపు లేదా తెలుపు నూలు బట్టని తీసుకుని, పసుపు పెట్టి, కుంకుమ వేసి స్వామిని భక్తితో తల్చుకుని, మనసులో ఉన్న కోర్కెను స్వామికి విన్నవించుకుని, మూడు గుప్పెళ్ళ బియ్యం ఆ బట్టలో పొయ్యాలి.
   రెండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ, తమలపాకులు అందులో ఉంచి మరోసారి స్వామిని తల్చుకుని మూట కట్టాలి. ఈ ముడుపును స్వామి ముందు ఉంచి, ధూపం సమర్పించి, కొబ్బరికాయ, పళ్ళు నివేదన చెయ్యాలి.
   తరువాత గణపతి ఆలయానికి వెళ్లి, గుడి చుట్టూ 3,11 లేదా 21 ప్రదక్షిణాలు చెయ్యాలి. అవకాశామున్నంతవరకు గణపతికి ప్రీతికరమైన గరిక వంటివాటితో పూజించడం ఉత్తమం. గణపతి ఆలయానికి వెళ్లడం సాధ్యం కాని పక్షంలో ఇంట్లోనే ఒకచోట గణపతి ప్రతిష్ట చేసి ప్రదక్షిణ చేయవచ్చును.
    పూజామందిరంలో ఉన్న గణపతిని కదపడం మంచిది కాదు. నివేదన చేసిన పళ్ళు సమర్పించడంగాని, పూజ ఎంత భారీగా  చేసాం అనేది ముఖ్యం కాదు. ఎంత శ్రద్దాభక్తులతో స్వామికి పూజ చేసాము అనేదే అత్యంత ముఖ్యమైన విషయం.
   సాయంత్రం స్నానం చేసి, దీపం వెలిగించి, స్వామిని పూజించాలి. వ్రతం రోజున సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్థాలుగాని, ఉప్పు వేసిన పదార్ధాలుగాని ఆరగించకూడదు. పాలు, పళ్ళు, పచ్చి కూరగాయలు తినవచ్చును.
    వ్రతం చేయడానికి నిర్ణయించుకున్నన్ని చవితి రోజులలోను (సంకష్టహర చతుర్థి రోజు) ఈ నియమాలు పాటించాలి. చంద్రోదయం జరిగిన తరువాత, చంద్ర దర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని ధూప దీప నైవేద్యాలను సమర్పించి మడిగా భుజించాలి.
    అనుకున్న సంకష్టహర చతుర్థి రోజులు పూర్తి అయ్యేక ముడుపు కట్టి పెట్టిన బియ్యంతో పొంగళిచేసి, స్వామికి నైవేద్యం సమర్పించి, అప్పుడు సాయంత్రం భుజించాలి. ఇటువంటి నియమాలు పాటించడం కష్టమని భావించేవారు, పాటించలేని వారు, రోజంతా ఉపవాసం ఉండి సంకటనాశన గణేశస్తోత్రం చదివి, గణపతి ఆలయం సందర్శించినా కూడా తగిన ఫలితం దక్కుతుంది.
   ఉపవాసం కూడా చేయలేనివారు, చతుర్థినాడు కనీసం నాలుగుసార్లు అయినా సంకటనాశన గణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.
వ్రత కథ :
   పుత్ర సంతానం లేని కృతవీర్యుడు చేసిన తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించింది. అతడు బ్రహ్మదేవుడిని ప్రార్థించి తన పుత్రుడికోసం ఈ వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లూ, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యుడికి ప్రసాదించినట్లూ గణేశ పురాణం తెలియచేస్తోంది.
 కృతవీర్యుడు ఈ వ్రతాన్ని ఆచరించి గణపతి అనుగ్రహంతో కార్తవీర్యార్జునుడి వంటి పుత్రుడిని పొందిన విషయం ఇంద్రుడి వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తానూ సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వినయకుడి లోకానికి తీసుకువెళ్ళగలిగినట్లూ  ఈ వ్రత కథ తెలియచేస్తోంది.
వ్రత ఫలితము:
   గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతం చెయ్యడం వలన కలిగే లాభాలు వివరించారు. వాటిలో పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, క్షయ వ్యాధి  శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యు హరణము, కుష్ఠు వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి.
     గణేశ ఉపాసకులు ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగిస్తుందని, సంతానాన్ని ప్రసాదిస్తుందని, దూరమైన బంధువులను తిరిగి కలుపుతుందని, జాతకదోషాలను పోగొడుతుందని గొప్ప వ్రతంగా తెలియజేస్తున్నారు.
   వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ఎల ముఖ్యమో.. సంకష్టహర గణపతి వ్రతానికి కృష్ణ చతుర్థి (బహుళ చవితి) ముఖ్యం.  మంగళ వారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. అవి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వస్తూ ఉంటాయి.
   అనారోగ్యాలతోను, కుటుంబ సమస్యలతోను బాధపడుతున్నవాళ్లు సంకష్టహర గణపతిని ఆశ్రయించి విధి విధనాలతో పూజిస్తే సకల బాధలు తొలగి ప్రశాంతమైన జీవితాన్ని పొందగలరు.  అందరు సుఖసంతోషాలతో ఉండాలని ఆ సంకష్టహర గణపతిని ప్రార్థిస్తూ... 
                                                                                                                          



No comments:

Post a Comment