About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

ఓర్పే ఆమె విజయం




ఓర్పే ఆమె విజయం
   అమె భర్తే అమెని గుర్తుపట్టలేక పోయాడు అంటే అంతకంటే దురదృష్టం ఇంకేముంటుంది?. అయినా చివరికి ఆమె గెలిచింది. ఇది శకుంతల కథ .
 మనం చూస్తూ ఉంటాం...నిజాయితీ లేని వాళ్ళు, సత్ప్రవర్తన లేని వాళ్ళు పెద్ద పెద్ద భవంతుల్లో చాలా గొప్పగా జీవిస్తుంటారు. నిజాయతీగా జీవించేవాళ్ళు, మంచి ప్రవర్తన కలిగినవాళ్ళు గుడిసెల్లో కష్టాలు అనుభవిస్తూ జీవిస్తుంటారు. ఇది న్యాయం కాదు! అని మనం అనుకుంటాం. సత్యవంతులు, నిజాయతీ కలవాళ్ళే ఎప్పుడూ కష్టపడుతూ జీవిస్తుంటారు. ఇలా ఎందుకు జరుగుతోంది?
   ఇటువంటి తేడాలు జరగడానికి వేరే కారణం ఏదీ ఉండదు. మనం ఏం చేస్తామో దాని వల్ల కలిగే ఫలితాన్ని మాత్రమే మనం అనుభవిస్తున్నాం. అంటే జరుగుతున్నదంతా మనం పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ప్రకారమే. మనం జరుగుతున్న దాన్ని మాత్రమే చూస్తున్నాం కాని, దానికి కారణం ఏమిటన్నది జరిగి పోయిన విషయం కాబట్టి దాన్ని గురించి తెలుసుకోలేం. అందుకనే మనం వాటిని పొరపాటుగా అర్ధం చేసుకుంటున్నాం.
   మనం అలోచించే ప్రతి అలోచనకి, చేస్తున్న ప్రతి పనికి వాటి ఫలితాన్ని తరువాత అనుభవిస్తాం. ఈ ఫలితాలే మనిషి జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఆ విధంగా మనిషి తన జీవితాన్ని తనే మలుచుకుంటున్నాడు. మనిషి జీవితం వేరే ఏ చట్టం ప్రకారం నడవట్లేదు... తనకు తను చేసుకున్న కర్మ ఫలితంగా తప్ప.
   మనం ఎంచుకున్న మార్గంలో నమ్మకం ఉన్నా లేకపోయినా నమ్మకంలోనే జీవితం దాగి ఉంది. దుర్మార్గుడికి తన దుర్మార్గంలోనే నమ్మకం ఉంటుంది. మనం మంచి మార్గంలో వెళ్ళాలి అంటే ముందు దాని మీద మనకు నమ్మకం ఉండాలి. కాని అలా జరగడం లేదు. ఓర్పు కలిగి ఉండడం వల్ల దేన్నైనా పొందచ్చు.  శకుంతల కూడా ఓర్పువల్లే సాధించింది.
   మొదట్లో శకుంతల ఏ సంతోషమూ లేకుండ గడిపింది. ఆమె తల్లితండ్రులు చిన్నతనంలోనే అమెని అడవిలో వదిలేసి వెళ్ళిపోయారు. ఆమెను పెంచడానికి అక్కడ ఎవరూ లేరు. అదృష్టవశాత్తూ మహర్షి కణ్వుడు ఆమె మీద దయతో తన ఆశ్రమానికి తీసుకుని వచ్చాడు. ఆ చుట్టు పక్కల ఎంతో మంది మహర్షులు తమ కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు. శకుంతల తనను పెంచుకున్న తండ్రితో కలిసి వాళ్ల మధ్య పెరిగింది.
   స్వతహాగా గొప్ప వ్యక్తులకే పుట్టినా కూడా ఆమె అడవిలో సామాన్యమైన జీవితం గడప వలసి వచ్చింది. పక్షులు, జింకలు, చిలుకలు, కుందేళ్ళు, ఆవులతో కలిసి పెరిగింది. చెట్లు, నదులు, పర్వతాలు అన్నింటి మధ్య, ఇంకా ఇతర మహర్షుల పిల్లలు, స్నేహితులతో ఆమె జీవితం అక్కడ ప్రశాంతంగా గడిచిపోతోంది.
   ఒక రోజు కణ్వుడు సొంత పని మీద వేరే చోటికి వెళ్ళాడు. ఆ సమయంలో దుష్యంతుడు అనే పేరు గల రాజు వేట కోసం అక్కడికి వచ్చాడు. శకుంతలని చూసి ఆమెని  పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాడు. ఆమె ఇష్టాన్ని అడిగాడు. తన తండ్రి పని మీద బయటకి వెళ్ళాడని తిరిగి వచ్చాక ఆయనతో మాట్లాడమంది.
   దుష్యంతుడు తను తిరిగి రాజ్యానికి వెళ్ళిపోవాలని తొందర పడ్డాడు. శకుంతలకి నచ్చచెప్పి అమెను పెళ్ళి చేసుకున్నాడు. పరివారాన్ని పంపించి తన రాజ్యానికి తీసుకుని వెడతానని నమ్మకంగా చెప్పి దుష్యంతుడు తిరిగి తన రాజధానికి వెళ్ళిపోయాడు.
   కణ్వుడు తిరిగి వచ్చిన తరువాత జరిగిన కథంతా విన్నాడు. జరిగినదానికి ముందు ఆశ్చర్యపోయినా కూతుర్ని మాత్రం ఆశీర్వదించాడు. రాజు పంపించిన మనుషులు వస్తారని చాలా కాలం ఎదురు చూశారు. ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటికే ఆమెకి ఒక కొడుకు కలిగాడు. భరతుడు అనే పేరుతో పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఆమెకు భర్త నుంచి ఎటువంటి సమాచారమూ అందలేదు. కణ్వుడు శకుంతలతో అమ్మా! ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండచ్చు. నీ అంతట నువ్వే ఆ రాజ్యానికి వెళ్ళు. నువ్వు ఆ రాజ్యానికి సంబంధించినదానివే కదా. నీ కొడుకు కూడ కొంచెం పెద్దవాడయ్యాడు. అతణ్ణి కూడా నీతో తీసుకుని వెళ్ళు. నువ్వేమీ భయపడక్కర్లేదు! అన్నాడు అనునయిస్తూ.
   శకుంతల కణ్వుడు చెప్పిన జాగ్రత్తలన్నీ విని, కొంతమంది శిష్యులతో కలిసి కొడుకుని తీసుకుని తన సమస్యని తనే ఎదుర్కోవాలని  దుష్యంతుడి రాజ్యానికి బయలుదేరింది. నిండు సభలో కూర్చుని ఉన్న దుష్యంతుడు ఆమె గురించి తనకేమీ తెలియదని, బహుశా ఒక అడవి మనిషిని అంత:పురంలోకి ప్రవేశ పెట్టడానికి ఇదొక పన్నాగం అయి ఉంటుందని అన్నాడు. శకుంతలని ఒక మోసగత్తెగా చిత్రించాడు. ఆమెతో వచ్చినవాళ్ళు శకుంతల సమస్య తీరాలంటే ఆమె అక్కడే కొన్ని రోజులు ఉండాలి. అందుకని ఆమెను అక్కడే వదిలి వెళ్ళడం మంచిదనుకున్నారు. నిస్సహాయస్థితిలో ఉన్న ఆమెని కొడుకుతో సహా అక్కడే వదిలి వెళ్ళిపోయారు. ఇంతకంటే పెద్ద ఆపద ఇంకేముంటుంది?
   నిస్సహయంగా నిలబడిన శకుంతలకి వెళ్ళడానికి మరొక చోటు లేదు. ఒకటే మార్గం ఉంది. తిరిగి అడవికి వెళ్ళిపోవడం. తన భర్త తనని నిరాకరించాడు కాబట్టి, తనను పెంచిన తండ్రి కూడా తనను నిరాకరించవచ్చు అనుకుంది. ఆ సమయంలో ఆకాశం నుంచి ఓ రాజా! ఈమె నీ భార్య శకుంతల, ఆమెతో ఉన్న చిన్నవాడు నీ కొడుకు. శకుంతల చాలా మంచిది, అంకిత భావం కలది. అమెను నువ్వు ఆదరించు! అని వినబడింది. ఇది ఒక విధంగా నడిచిన కథ.
   మరో విధంగా నడిచిన కథ...శకుంతల తన కొడుకుతో కలిసి నిలబడి ఉంది. ఆమె తనకు జరిగిన అవమానాన్ని భరించలేక పోయింది. తను నిలబడి ఉన్నభూమి అప్పటికప్పుడే చీలిపోయి తనను లోపలికి తీసుకుపోతే బాగుండుననుకుంది. ఆమెకి వెళ్ళడానికి అడవి తప్ప మరో ప్రదేశం తెలియదు. తనతో వచ్చిన స్నేహితులు కళ్ళ నీళ్లతో తిరిగి వెళ్ళిపోయారు. జరుగుతున్న పరిస్థితులకి ఆమె నిశ్చేష్టురాలయ్యింది. తనకు నగరం తెలియదు. ఎక్కడికి వెళ్ళాలి? అడవికి వెళ్ళి తనకోసం ఒక ఆశ్రమం నిర్మించుకుని తన కొడుకుతో కలిసి ఉండాలని నిశ్చయించుకుంది. భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ అడవి వైపు నడవడం ప్రారంభించింది.
   భరతుడికి మొత్తం రాజలక్షణాలే ఉన్నాయి. పులులతోను, ఇతర జంతువులతోను భయం లేకుండ ఆడతాడు. ఆమె తన భర్తని నిందించలేదు. భారతీయ స్త్రీలు మంచి రోజులు రావాలని ఎదురు చూస్తారే కాని భర్తల్ని నిందించరు. శకుంతలకి రాజభోగాలు అనుభవించాలన్న కోరిక లేదు. తన భర్తను చేరుకోవాలని మాత్రమే ఆశిస్తోంది. విధిని ఎవరూ ఎదిరించలేరు. ఆడవిలో కొడుకుతో కలిసి జీవనం సాగిస్తోంది. భగవంతుడు మంచి నడవడిక కలవాళ్ళకి ఎప్పుడూ అన్యాయం చెయ్యడు.
   దుష్యంతుడు శకుంతలని అడవిలో పెళ్ళి చేసుకున్నప్పుడు అమెకు ఒక ఉంగరం ఇచ్చాడు. దాని మీద రాజముద్రిక ఉంది. కనుక, శకుంతల దుష్యంతుల పెళ్ళి జరిగింది అనడానికి అదొక నిదర్శనం. కాని, పడవలో రాజధానికి వస్తున్నప్పుడు దురదృష్టవశాత్తూ ఆ ఉంగరం శకుంతల చేతి నుంచి జారి నీళ్ళల్లో పడిపోయింది.
   విషయాలు వాటికవే మారిపోతూ ఉంటాయి. శకుంతలని పంపించేశాక కొంతకాలానికి ఒక జాలరి రాజప్రాసాదానికి వెళ్ళాడు. అతడు ఆ ఉంగరాన్ని భటులకి చూపించి లోపలికి వెళ్ళడానికి అనుమతి అడిగాడు. రాజుకి ఆ ఉంగరాన్ని చూడగానే అంతకు ముందు జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా  గుర్తుకొచ్చాయి. తను వేటకోసం అడవికి వెళ్ళడం, కణ్వమహర్షి కూతురు శకుంతలని చూసి ఇష్ట పడడం, శకుంతలతో పెళ్ళి జరగడం అన్నీ గుర్తొచ్చాయి. తన ప్రవర్తనకి తనే సిగ్గుపడ్డాడు.   స్వచ్ఛత, ఓర్పు, పట్టుదల ఈ మూడూ విజయానికి అవసరం.  నేర్పుతో వాటిని అలవరుచుకుంటే విజయం మనవైపే ఉంటుంది అన్నారు స్వామి వివేకానందుడు.
   ఆ ఉంగరం జాలరి దగ్గరికి ఎలా వచ్చింది? అతడు తనకు దొరికిన చేపని నరికినప్పుడు దాని పొట్టలో ఉన్న ఉంగరం అతడికి కనిపించింది. అది శకుంతలకి దుష్యంత మహారాజు ఇచ్చిన ఉంగరం. ఆ ఉంగరం చూసిన వెంటనే దుష్యంతుడు శకుంతలను వెతుక్కుంటూ వెళ్ళి ఆమెను కలిసి రాజ్యానికి తీసుకుని వచ్చాడు. తరువాత చాలాకాలం శకుంతల దుష్యంతులు కలిసి మెలిసి అన్యోన్యంగా జీవించారు. ఆపదలు కలిగినప్పుడు సహనంతో ఉంటే వాటంతట అవే అవకాశాలుగా మారి.. పోయినవన్నీ తిరిగి మన దగ్గరకే చేరుతాయి.
   శకుంతల కథ లోకంలో చిరస్థాయిగా నిలిచిపోయింది.


No comments:

Post a Comment